కృష్ణమ్మ ఒడ్డున గోదావరి నేతలకు లోకేశ్ విందు... ఫొటోలు ఇవిగో!

  • కూటమి ప్రజాప్రతినిధుల కోసం మంత్రి లోకేశ్ ఆత్మీయ విందులు
  • రాజమండ్రి, నర్సాపురం నేతలకు ఉండవల్లిలో ఆతిథ్యం
  • కుటుంబ సమేతంగా హాజరై సందడి చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
  • మూడు పార్టీలు కాదు ఒకే కుటుంబమని చాటిచెప్పిన నేతలు
  • మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహూకరించిన లోకేశ్
రాజకీయాల్లో కుటుంబ విలువలకు, సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. కూటమిలోని ప్రజాప్రతినిధుల కోసం ఆయన ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ విందు సమావేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం నాడు... రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఘనంగా ఆతిథ్యమిచ్చారు.  ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబసమేతంగా విందు ఏర్పాటు చేశారు.

కృష్ణా నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం వనభోజనాలను తలపించింది. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన అతిథులకు లోకేశ్ దంపతులు ఘన స్వాగతం పలికి, మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. పెద్దల మధ్య సంభాషణలు, పిల్లల ఆటపాటలు, మహిళల పలకరింపులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలంతా తమ కుటుంబాలతో హాజరై.. కూటమి అంటే మూడు పార్టీలు కాదని, అదొకటేనని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా నేతలు మంత్రి లోకేశ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనకు ఎంతో ఇష్టమైన రత్నం పెన్‌ను లోకేశ్ కు బహుమతిగా ఇచ్చారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.. లోకేశ్, బ్రాహ్మణి దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో కళాత్మకంగా ఎంబ్రాయిడరీ చేసి కానుకగా అందించారు. విందు అనంతరం మహిళలందరికీ లోకేశ్ దంపతులు మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.

ఈ ఆత్మీయ విందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. 


More Telugu News