ఏఐ సమ్మిట్ లో చొక్కాలు విప్పి నిరసన... సమర్థించుకున్న కాంగ్రెస్ నాయకత్వం

ఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్‌లు విప్పి ప్రదర్శన చేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం మొదలైంది.

ఈ నిరసనను కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమర్థించుకుంది. "దేశంలోని యువత, రైతులు, వ్యాపారుల ఆగ్రహాన్ని యూత్ కాంగ్రెస్ సహచరులు తమ నిరసన రూపంలో వ్యక్తం చేశారు" అని 'ఎక్స్' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ మన యువత, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలపై దాడి చేశారు. దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు" అని తీవ్ర ఆరోపణలు చేసింది. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రజల గొంతుకను వినిపిస్తామని పేర్కొంది.

కాంగ్రెస్ నిరసనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అంతర్జాతీయ సదస్సుకు అంతరాయం కలిగించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ఈ నిరసనను "చొక్కాలు లేని, బుర్ర లేని, సిగ్గులేని చర్య"గా అభివర్ణించారు. ఇది దేశానికి అవమానకరమని, భారత్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, సుందర్ పిచాయ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు హాజరైన సదస్సులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, రైతు ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత అని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఒప్పందం పూర్తి వివరాలు వచ్చే నెలలో వెల్లడవుతాయని తెలిపింది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు క్యూఆర్ కోడ్‌లతో భారత్ మండపంలోకి ప్రవేశించి ఈ నిరసన చేపట్టారు.

Youth Congress
AI Impact Summit 2026
India US Trade Deal
Sambat Patra
Pradeep Bhandari
Emmanuel Macron
Antonio Guterres
protest
BJP
Congress

More Telugu News