Ram Bhavan: 33 మంది బాలలపై లైంగిక దాడి... యూపీలో ఇంజినీర్ దంపతులకు మరణశిక్ష

సమాజంలో అత్యంత కిరాతకమైన, హేయమైన నేరానికి పాల్పడిన ప్రభుత్వ అధికారికి, ఆయన భార్యకు కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 33 మంది చిన్నారులపై (అందరూ అబ్బాయిలే) దశాబ్ద కాలంగా లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బాందా ప్రత్యేక పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును "అరుదైన వాటిలో అత్యంత అరుదైనది"గా అభివర్ణించిన న్యాయస్థానం, నిందితులకు కఠిన శిక్ష విధించడం ద్వారానే న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే, యూపీ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాంభవన్, ఆయన భార్య దుర్గావతి సుమారు 2010 నుంచి 2020 వరకు బాందా, చిత్రకూట్ జిల్లాల్లో ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ వీడియో గేమ్స్, డబ్బు, బహుమతులు ఆశ చూపి చిన్నారులను లొంగదీసుకుని వారిపై లైంగిక దాడి చేసేవారు. ఈ క్రమంలో వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరించి, వాటిని ఇంటర్నెట్‌లో ప్రసారం చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. బాధితుల్లో మూడేళ్ల పసిపిల్లలు కూడా ఉండటం ఈ నేర తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ, 2020 అక్టోబర్ 31న కేసు నమోదు చేసి, 2021 ఫిబ్రవరి 10న రాంభవన్ దంపతులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద వీరిని దోషులుగా నిర్ధారిస్తూ శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుల నైతిక పతనం, నేరాల తీవ్రత దృష్ట్యా వారికి పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఇవ్వరాదని, అత్యున్నత శిక్ష మాత్రమే సరైనదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

నిందితుల లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరికొందరికి మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తాయి. చాలామంది ఇప్పటికీ మానసిక వేదన అనుభవిస్తున్నారని సీబీఐ తెలిపింది.

ఈ కేసులో బాధితులందరికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలా రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితుల ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంచాలని సూచించింది. దర్యాప్తు సమయంలో బాధితులైన చిన్నారుల పట్ల సీబీఐ అధికారులు అత్యంత సున్నితంగా వ్యవహరించారని, వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి మానసిక స్థైర్యాన్ని కాపాడారని సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వైద్య నిపుణులతో సమన్వయం చేసుకుంటూ డిజిటల్ ఆధారాలను పకడ్బందీగా సేకరించినట్లు తెలిపింది.
Ram Bhavan
UP child abuse case
POCSO Act
Uttar Pradesh
child sexual abuse
Banda
CBI investigation
Durga Vati
online games
child victims

More Telugu News