Rahul Gandhi: ఏఐ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ నిరసన... రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు' వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు చొక్కాలు విప్పి నిరసన తెలపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దర్శకత్వంలోనే ఈ నిరసన జరిగిందని, ఇది ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని వారు మండిపడ్డారు.

ఈ ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "భారత్ ఏఐ సదస్సు ద్వారా స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందుకుంటున్న తరుణంలో, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు, హేయమైన చర్యలు, సిగ్గుమాలిన ప్రవర్తనను తీవ్రంగా ఖండించాలి. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, పోకిరీల్లా చొక్కాలు లేకుండా తిరుగుతూ సదస్సుకు అంతరాయం కలిగించారు. ఇది మన యువతలోని స్ఫూర్తిని, పారిశ్రామిక స్ఫూర్తిని దారుణంగా అవమానించడమే. యువతను ప్రోత్సహించాల్సింది పోయి, రాహుల్ గాంధీ వారిలో నిరాశ, నిస్పృహలను నింపుతున్నారు" అని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఏ చర్యలోనూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రతి వేదికనూ దేశ పురోగతిని కించపరిచేందుకే వాడుకుంటున్నారని ఆరోపించారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. "కాంగ్రెస్‌కు పూర్తిగా పిచ్చి పట్టింది. సిగ్గులేని ద్వంద్వ క్రీడ ఇది. ఏఐ సదస్సులో రాహుల్ గాంధీ దర్శకత్వంలో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తూ చొక్కాలు విప్పి నిరసనల పేరుతో చౌకబారు నాటకాలు ఆడుతోంది" అని ఆయన మండిపడ్డారు. అదే సమయంలో, సదస్సు వేదిక లోపల అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రపంచంలోని మేధావులను ఒకేచోటకు చేర్చినందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. "ఒకే పార్టీ, రెండు ముఖాలు, సున్నా గౌరవం. ఇది ప్రతిపక్షం తీరు కాదు, దేశాన్ని అవమానించడమే. ఇది రాజకీయ స్కిజోఫ్రెనియా. ప్రపంచ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నప్పుడు, గేటు వద్ద ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకూడదు. ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యత" అని బండి సంజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి, ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ నిరసన నిర్వహించారు. ఈ ఒప్పందం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
Rahul Gandhi
Kishan Reddy
Bandi Sanjay
AI Summit
India AI Impact Summit
Congress Protest
Revanth Reddy
Telangana
BJP
Political Controversy

More Telugu News