Bombay High Court: తండ్రి పేరు అక్కర్లేదు.. బిడ్డకు తల్లే సర్వస్వం: ఒంటరి తల్లుల హక్కులపై బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

Bombay High Court Landmark Judgement for Single Mothers
షార్ట్స్‌లో చూడండి
సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య విధానాలకు చరమగీతం పాడుతూ బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. బిడ్డ గుర్తింపునకు తండ్రి పేరు తప్పనిసరి కాదని, తల్లి పేరు, కులంతోనే అన్ని హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అత్యాచారం వల్ల జన్మించిన 12 ఏళ్ల బాలిక స్కూల్ రికార్డుల నుంచి ఆమె తండ్రి పేరును పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన 12 ఏళ్ల కుమార్తె తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన అత్యాచారం వల్లే పాప జన్మించిందని, ఆ తర్వాత నిందితుడు 2022లో జరిగిన ఒక సెటిల్మెంట్‌లో బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చాడని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, స్కూల్ రికార్డుల్లో తండ్రి పేరు, ఆయన కులం (మరాఠా) ఉండటం వల్ల తన కుమార్తె సామాజికంగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. తన కుమార్తెకు తన కులమైన 'మహర్' (ఎస్సీ)ని వర్తింపజేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒంటరి తల్లిని బిడ్డకు పూర్తిస్థాయి సంరక్షకురాలిగా గుర్తించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అది దయతో చేసే పని కాదని స్పష్టం చేసింది. బాధ్యతలేని తండ్రి కులాన్ని బిడ్డ మోయాల్సిన అవసరం లేదని, తల్లి సామాజిక హోదానే బిడ్డకు వర్తిస్తుందని తేల్చిచెప్పింది. స్కూల్ నిబంధనల పేరుతో ఈ మార్పులు చేయలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడాన్ని కోర్టు తోసిపుచ్చింది.

గతంలో సుప్రీంకోర్టు కూడా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రాల విషయంలో తండ్రి పేరు లేకుండా తల్లి అనుమతితోనే జారీ చేయవచ్చని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు బాంబే హైకోర్టు కులం విషయంలోనూ స్పష్టతనివ్వడం దేశవ్యాప్తంగా ఉన్న ఒంటరి తల్లులకు గొప్ప ఊరటనిచ్చింది.
Go Back to Shorts
Bombay High Court
Single mothers rights
Child custody India
High Court Judgement
Paternity rights India
Beed district Maharashtra
Rape victim child
Supreme Court Judgement
Child caste single mother
Mahar caste

More Telugu News