కర్నూలు క్లస్టర్ వర్సిటీని పూర్తి చేస్తాం: గౌరు చరితారెడ్డి ప్రశ్నకు లోకేశ్ సమాధానం

  • అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని కోరిన పాణ్యం ఎమ్మెల్యే
  • క్లస్టర్ యూనివర్సిటీకి రూ.139 కోట్లు మంజూరు కాగా రూ.55 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడి
  • వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి నారా లోకేశ్
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూ.139 కోట్లు మంజూరు కాగా, అందులో 'రూసా' పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, క్లస్టర్ యూనివర్సిటీలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.74.5 కోట్లు అవసరమని తెలిపారు.

ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్ అప్రోచ్ తో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. ఇందుకోసం వర్టికల్ - హారిజంటల్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉందని అన్నారు. అవసరమైన ఎకో సిస్టమ్ ను అక్కడ క్రియేట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా స్పెషలైజేషన్ పై దృష్టి సారించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అంతకుముందు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను ఒకే గూటి కిందకు తెచ్చి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చొరవ చూపి 'రూసా' పథకం కింద రూ.55 కోట్లు మంజూరు చేయించి, పనులు చేపట్టారని తెలిపారు.

భవనాల నిర్మాణం చేపట్టి ఎంఎస్ వైరాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఎంసీఏ వంటి కోర్సులు ప్రారంభించేందుకు జగన్నాథగట్టు పక్కన 50 ఎకరాల్లో క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా మంజూరు చేసిందని తెలిపారు.

అయితే కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్టర్ సెక్యూరిటీని కూడా తొలగించడంతో అక్కడి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని వాపోయారు. తక్షణమే అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేసి, కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే చరితారెడ్డి విజ్ఞప్తి చేశారు.


More Telugu News