ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత చేరువలో ఉండేవారు: బిల్ గేట్స్

  • అమరావతిలో సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశం
  • చంద్రబాబు ముందుచూపు ఉన్న నేత అంటూ గేట్స్ ప్రశంస
  • స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను వివరించిన ముఖ్యమంత్రి
  • విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యానికి నిర్ణయం
  • కుప్పం 'సంజీవని' ప్రాజెక్టుపై బిల్ గేట్స్ ప్రత్యేక అభినందన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో నవ్యాంధ్రకు కొత్త దశ-దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. 

ఈ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. బిల్ గేట్స్ రాకను చారిత్రాత్మకమని అభివర్ణించిన సీఎం, ఈ భాగస్వామ్యం రాష్ట్ర ప్రజల సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. 1997లో తొలిసారి బిల్ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు విజనరీ అని ఆనాడే తెలిసింది
ఈ సమావేశంలో మాట్లాడిన బిల్ గేట్స్, భారత డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తాను తొలిసారి చంద్రబాబును కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లోని ముందుచూపును గ్రహించానని వెల్లడించారు. ఆ రోజుల్లో ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత సమీపంలో ఉండేవారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఈ స్థాయిలో వినియోగించడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం గొప్ప పరిణామమని అభినందించారు. విపత్తుల నిర్వహణలో టెక్నాలజీతో ప్రాణనష్టం నివారించే వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. చంద్రబాబు తనకు "గుడ్ ఓల్డ్ ఫ్రెండ్" అని బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.

2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా రాష్ట్రం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర-2047' విజన్‌పై బిల్ గేట్స్‌కు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి రాష్ట్రానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీని ప్రస్తుత 180 బిలియన్ డాలర్ల నుంచి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం, తలసరి ఆదాయాన్ని 3,400 డాలర్ల నుంచి 42,000 డాలర్లకు పెంచడం, ఎగుమతులను 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు వృద్ధి చేయడం వంటి లక్ష్యాలను పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగాన్ని 2 శాతానికి తగ్గించడం, మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని 80 శాతానికి పెంచడం, సంపూర్ణ అక్షరాస్యత సాధించడం వంటివి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 13.4 లక్షల మంది విద్యార్థుల కోసం ఓఆర్ఎఫ్ టూల్ వినియోగిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో ఏఐ ద్వారా రైతులకు సాగు సలహాలు అందించడం, డ్రోన్లు వంటి యంత్రాలను అద్దెకు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలను వివరించారు. తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలతో రైతులను నష్టాల నుంచి కాపాడుతున్నామని తెలిపారు. గోధార్ యాప్‌తో పశువుల ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జూలై కల్లా రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న ‘సంజీవని’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వివరించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని, ఇప్పటికే 2.9 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జూలై 2026 నాటికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ 'ఏఐ డాక్టర్' సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

బిల్‌గేట్స్‌తో మంత్రుల ఇంటరాక్షన్
ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ పలు అంశాలపై బిల్ గేట్స్‌ను ప్రశ్నలు అడిగారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు ఆలోచనకు కారణమేంటని పయ్యావుల అడగ్గా... నాడు చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల హైదరాబాద్‌కు చెందిన టెక్ నిపుణులు తమ వద్ద ఎక్కువగా ఉండేవారని, వారి సూచన మేరకే అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని బిల్ గేట్స్ వివరించారు. ఏఐ ద్వారా ఆరోగ్య సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా సమర్ధవంతంగా అందించవచ్చని మంత్రి సత్యకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏఐ రాకతో ఉద్యోగాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై ఢిల్లీలో జరిగే సమ్మిట్‌లో చర్చిస్తామని ఆయన తెలిపారు.







More Telugu News