వ్యూస్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్
- పాకిస్థాన్ పై 61 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్
- డిజిటల్ వేదికపై రికార్డులు క్రియేట్ చేసిన మ్యాచ్
- జియో హాట్ స్టార్ లో మ్యాచ్ ను వీక్షించిన 45.4 కోట్ల మంది
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ లలో కూడా సంబరాలు జరిగాయి. మరోవైపు, ఈ మ్యాచ్ డిజిటల్ వేదికలపై కూడా రికార్డులు క్రియేట్ చేసింది. జియో హాట్‌స్టార్ యాప్, వెబ్ సైట్‌లో ఈ మ్యాచ్‌ను 45.4 కోట్ల మంది వీక్షించారు. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్.
అంతకుముందు ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు 26 కోట్లు, నమీబియాతో మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులు ఈ దాయాదుల పోరును లైవ్‌లో చూశారు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బౌలర్లు పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో, భారత్ 61 పరుగుల భారీ తేడాతో భారీ విజయం సాధించింది.