పొరపాటుగా మాట్లాడాను.. క్షమించండి: త్రిషపై వ్యాఖ్యల పట్ల బీజేపీ నేత విచారం

  • త్రిష ఆగ్రహం వ్యక్తం చేసిన కాసేపటికే స్పందించిన నాగేంద్రన్
  • నా వ్యాఖ్యల పట్ల బాధపడిన వారికి క్షమాపణ చెబుతున్నానన్న నాగేంద్రన్
  • ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సినీ నటి త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన త్రిషకు క్షమాపణ చెప్పారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కోరారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నటి త్రిష తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను అనుకోలేదని, సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని త్రిష మండిపడ్డారు.

త్రిష స్పందించిన కొద్దిసేపటికే నైనార్ నాగేంద్రన్ తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. "ఇవి పొరపాటున చేసిన వ్యాఖ్యలు. బీజేపీ అఖిల భారత మహిళా విభాగం నాయకురాలు వానతి శ్రీనివాసన్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై నాతో ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడారు. నా వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను" అని నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు.

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, అలాగే ఎవరి మనసును బాధపెట్టకూడదనే అనుకుంటానని అన్నారు.

కాగా, ఇటీవల బహిరంగ సభలో నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనలా సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై నాగేంద్రన్ స్పందిస్తూ, విజయ్‌కి రాజకీయ అనుభవం లేదని, మొదట త్రిషతో బంధం నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో మమేకం కావాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి.


More Telugu News