Danish Kaneria: పాకిస్థాన్ ఆటగాళ్లు మాటలు ఆపి ఆటపై దృష్టి పెట్టాలి: భారత్‌తో ఓడిపోవడంపై డానిష్ కనేరియా

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తమ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. లక్ష్యాలను ఛేదించడంలో పాక్ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఈ మ్యాచ్ ద్వారా వెల్లడైందని అన్నాడు. పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు మైదానం వెలుపల ప్రకటనలు చేయడం కంటే మైదానంలో క్రికెట్ ఆటపై దృష్టి సారించాలని సూచించాడు.

పాకిస్థాన్ ఆడిన తీరు తీవ్ర నిరాశపరిచిందని అన్నాడు. ఆటగాళ్లు ప్రకటనలకు పరిమితం కాకుండా ఆటపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపాడు. పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపిస్తాననే విధంగా ఉస్మాన్ తారిఖ్ మాట్లాడాడని, తమ బౌలర్లను చూసి భారత్ భయపడుతోందని అన్నాడని గుర్తు చేశాడు. కానీ భారత ఆటగాళ్లు మాటల కంటే మైదానంలో ఆట ద్వారా తామేంటో నిరూపిస్తారని ప్రశంసించాడు.

భారత్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని పాకిస్థాన్‌కు తెలుసని అన్నాడు. భారత్ చాలాకాలంగా శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడలేదని, కానీ పాకిస్థాన్ చాలాసార్లు ఆడిందని గుర్తు చేశాడు. కోచ్‌లు వ్యూహాలను సిద్ధం చేసుకోనట్లుగా ఉందని విమర్శించాడు. ఇది పూర్తిగా గేమ్ ప్లాన్ లేకపోవడం వల్ల వచ్చిన ఓటమిగా డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.

భారత్ తమ ఎదుట ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడం పాకిస్థాన్‌కు కష్టమనే విషయం అందరికీ అర్థమైందని అన్నాడు. అవలీలగా ఓడించగలమని పాకిస్థాన్ ఆటగాళ్లు చెప్పడం హాస్యాస్పదమని అన్నాడు. టీమిండియాలో ధోని, విరాట్ కోహ్లీల వలె క్లిష్ట సమయంలో పాకిస్థాన్ జట్టును సీనియర్ ఆటగాడు బాబర్ అజామ్ నడిపించాల్సిందని అన్నాడు. ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు చేయడం ద్వారా పాక్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడని, కానీ అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంపౌట్ కావడంతో పాకిస్థాన్ చేతి నుంచి మ్యాచ్ చేజారిందని అన్నాడు.

ఉస్మాన్ ఖాన్ బాగా ఆడినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు వైఫల్యం చెందారని డానిష్ కనేరియా అన్నాడు. భారత్‌ను ఓడిస్తామంటూ ప్రకటనలు చేసి, ఇలా ఓడిపోతే అభిమానులు మరింత నిరాశకు గురవుతారని అన్నాడు. కాబట్టి అనవసర ప్రకటనలు చేయవద్దని సూచించాడు. ఇటీవల షహీన్ అఫ్రిది రాణించడం లేదని అన్నాడు. టీమిండియా మంచి బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉందని, పాకిస్థాన్‌కు ఆ సామర్థ్యం లేదని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ పాక్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నాడు.
Danish Kaneria
Pakistan cricket
India vs Pakistan
T20 World Cup
Babar Azam
Usman Khan
Cricket analysis

More Telugu News