Payyavula Keshav: నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల

Payyavula Keshav to Present AP Budget in Assembly Today
  • నేడు ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
  • 2026 - 27 ఆర్థిక బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్
  • 11.15 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
  • రూ.3.32 లక్షల కోట్ల మేర ఆర్ధిక బడ్జెట్ ఉండే అవకాశం
ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశముంది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఈసారి సుమారు రూ.10,000 కోట్ల మేర పెంపు ఉండనున్నట్లు భావిస్తున్నారు. 

ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర బడ్జెట్‌ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. ఈ నెల 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు ఇచ్చే రెవెన్యూ లోటు నిధులను పూర్తిగా నిలిపివేయడంతో రాష్ట్రానికి ఏడాదికి సుమారు రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇతర గ్రాంట్లలోనూ కోతలు పడినట్లు సమాచారం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, పెరుగుదల స్వల్పంగానే ఉందని అంటున్నారు. 

సాధారణంగా ప్రతి ఏడాది బడ్జెట్‌ను సుమారు 10 శాతం పెంచే సంప్రదాయం ఉండగా, ఈసారి మాత్రం పరిమిత పెంపుతోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు తగిన నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం, రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
Payyavula Keshav
AP Budget 2024
Andhra Pradesh Budget
AP Assembly
Chandrababu Naidu
Acham Naidu
Andhra Pradesh Economy
Super Six Promises
AP Finance Minister
Vangalapudi Anitha

More Telugu News