ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

  • చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకుని తిరుమలకు పాదయాత్ర చేసిన బండ్ల గణేశ్
  • 23 రోజుల్లో 535 కిలోమీటర్ల మేర సాగిన సంకల్ప యాత్ర
  • మొక్కు చెల్లించుకున్న అనంతరం సీఎంకు శ్రీవారి ప్రసాదం అందజేత
  • పాదయాత్ర అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్న బండ్ల గణేశ్
సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో, ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్, ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు బండ్ల గణేశ్ ఒక సంకల్పం తీసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై, తిరిగి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు నాలుగోసారి సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో 'సంకల్ప యాత్ర' పేరుతో జనవరి 19న షాద్‌నగర్‌లోని తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు నడిచి, ఫిబ్రవరి 10న తిరుమల చేరుకున్నారు. రెండు రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

అనంతరం నేడు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. పాదయాత్ర సాగిన తీరును, దారిపొడవునా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలిచి ప్రోత్సహించారని బండ్ల గణేశ్ ముఖ్యమంత్రికి వివరించారు.


More Telugu News