నిన్న 'అథెంటికేషన్', ఈ రోజు 'ప్రివిలేజ్'... మీడియాపై రాహుల్ గాంధీ అసహనం

  • మీడియా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
  • ప్రివిలేజ్ మోషన్ గురించి ప్రశ్నించడంతో అసహనానికి గురి
  • 'ప్రివిలేజ్' అన్నది ఈరోజు మీ కోడ్ వర్డా అంటూ ఘాటు వ్యాఖ్య
  • నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వృత్తి గౌరవాన్ని కాపాడాలని మీడియాకు సూచన
  • ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో రాహుల్‌పై చర్యలకు బీజేపీ యోచన
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మీడియా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అధికార పక్షం ప్రివిలేజ్ మోషన్ (సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం) ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న వార్తలపై ప్రశ్నించడంతో ఆయన అసహనానికి గురయ్యారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ జర్నలిస్టులకు హితవు పలికారు.

గురువారం పార్లమెంట్ ప్రాంగణం వెలుపల తన కారు వద్దకు వస్తున్న రాహుల్‌ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ప్రివిలేజ్ మోషన్ గురించి స్పందన కోరగా, ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో స్పందించారు. ‘‘ప్రివిలేజ్ అనేది ఈరోజు మీ కోడ్ వర్డా? ఈ పదాన్ని మీకు ఈరోజే ఇచ్చారా? నిన్న ‘అథెంటికేషన్’ అన్నారు, ఈరోజు ‘ప్రివిలేజ్’ అంటున్నారు. మీరేమీ పూర్తిగా బీజేపీ ఉద్యోగులు కాదు కదా. కాస్త నిష్పక్షపాతంగా పనిచేయడానికి ప్రయత్నించాలి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘మీడియాగా మీకు ఒక బాధ్యత ఉంది, వృత్తి గౌరవాన్ని కాపాడాలి’’ అని ఆయన సూచించారు.

నిన్న లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. భారతమాతను, దేశ ప్రయోజనాలను విదేశీ శక్తులకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆధారం లేని ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై ప్రివిలేజ్ మోషన్ తెస్తామని బీజేపీ ఎంపీలు హెచ్చరించారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌కు అండగా నిలిచింది. ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంలో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించే హక్కు ప్రతిపక్ష నేతకు ఉందని స్పష్టం చేసింది. కాగా, రాహుల్‌పై ప్రివిలేజ్ మోషన్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, దీనికి బదులుగా ఆయనపై సబ్‌స్టాంటివ్ మోషన్ (వ్యక్తిగత ప్రాతిపదికన ఇచ్చే నోటీసు) ప్రవేశపెట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


More Telugu News