ఆధునిక సాంకేతికతతో పిచ్ ను ఎప్పుడైనా మార్చేయవచ్చు: సక్లైన్ ముస్తాక్

  • ఈ నెల 15న ఇండియా - పాకిస్థాన్ మధ్య మ్యాచ్
  • బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన సక్సైన్ ముస్తాక్
  • ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని వ్యాఖ్య
టీ20 వరల్డ్‌కప్‌ లో భాగంగా భారత్‌–పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందే మైదానానికి బయట మాటల యుద్ధం మొదలైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీసీసీఐపై తన అక్కసు వెళ్లగక్కాడు.

సక్లైన్ మాట్లాడుతూ, ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని ఆరోపించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పిచ్‌ను గ్రౌండ్స్ మెన్ ఎప్పుడైనా మార్చేయవచ్చని విచిత్రమైన ఆరోపణలు చేశాడు. అయితే, అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పిచ్ సిద్ధం చేసే ప్రక్రియ కఠిన నియమావళి ప్రకారం జరుగుతుంది. ఐసీసీ క్యూరేటర్లు, మ్యాచ్ రిఫరీలు, గ్రౌండ్స్‌మెన్ సమన్వయంతో ముందస్తు ప్లాన్ ప్రకారం పిచ్ తయారు చేస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు అకస్మాత్తుగా పిచ్ మార్చడం సాధ్యంకాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇదే సమయంలో పాకిస్థాన్ బౌలింగ్ కాంబినేషన్‌పై సక్లైన్ సందేహాలు వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్ కు ముందు ఉస్మాన్ తారిఖ్ ఆత్మవిశ్వాసాన్ని పొందాడని చెప్పాడు. అయితే జట్టుకు ఇద్దరు పేసర్లు, ఒక ఆల్ రౌండర్ అవసరమైతే మొత్తం సమీకరణం మారిపోతుందని తెలిపాడు. పాకిస్థాన్ తరపున 20వ ఓవర్ ఎవరు వేస్తారు? తారిక్? నవాజ్? షాదాబ్? అబ్రార్? వీరిలో ఎవరు వేస్తారని ప్రశ్నించాడు.


More Telugu News