Turkey Parliament: టర్కీ పార్లమెంటులో రణరంగం.. ఎంపీల పిడిగుద్దులు.. వీడియో ఇదిగో!

Turkey Parliament MPs Fight Over Justice Minister Appointment
  • టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ
  • కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై ప్రతిపక్షాల ఆగ్రహం
  • మంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడంతో తోపులాట
  • ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టిన అధికారికి మంత్రి పదవిపై విమర్శలు
టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది.

అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్‌లో మార్పులు చేసి, వివాదాస్పద అధికారి అయిన అకిన్ గుర్లెక్‌ను కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు పోడియం వద్దకు వస్తుండగా ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార ఏకే పార్టీ సభ్యులు వారిని నిలువరించబోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

ఘర్షణల నేపథ్యంలో పార్లమెంట్ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం, అధికార పార్టీ ఎంపీలు గుర్లెక్‌కు రక్షణగా నిలబడగా ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.

గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన గుర్లెక్ ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇమామోగ్లుపై 142 అభియోగాలు మోపి, 2,000 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించాలని కోరడం వెనుక గుర్లెక్ ఉన్నారని వారు విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తికి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Turkey Parliament
Turkish MPs Fight
Akin Gurlek
Erdogan
Republican People's Party
Justice Minister Appointment
Ekrem Imamoglu
Istanbul Mayor
Turkish Politics
Parliament Brawl

More Telugu News