కెనడా స్కూల్‌లో కాల్పులకు పాల్పడింది ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ!

  • కాల్పుల్లో 8 మంది మృతి
  • మృతుల్లో నిందితురాలి తల్లి, సోదరుడు
  • ఐదుగురు పాఠశాల విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు కూడా మృతి
  • నిందితురాలికి తీవ్ర మానసిక సమస్యలు 
  • గతంలోనే ఫిర్యాదులు అందాయని పోలీసుల వెల్లడి
  • కెనడా ఘటనపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నిన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడింది ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ అని పోలీసులు తాజాగా వెల్లడించారు. కాల్పుల అనంతరం నిందితురాలు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో నిందితురాలి కన్నతల్లి, సోదరుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కిరాతకానికి వెనుక కుటుంబ కలహాలు, మానసిక అస్థిరత కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈమె ఆరేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకుని పురుషుడి నుంచి మహిళగా మారినట్లు అధికారులు ధ్రువీకరించారు. తొలుత ఇంట్లో ఉన్న తన తల్లి, సవతి సోదరుడిని తుపాకీతో కాల్చి చంపింది. ఆ తర్వాత, తాను నాలుగేళ్ల క్రితం చదువు మానేసిన సమీపంలోని హైస్కూల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ బీభత్సంలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు, 12 నుంచి 13 ఏళ్ల వయసున్న ఐదుగురు అమాయక విద్యార్థులు (ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

సమాచారం అందిన కేవలం రెండు నిమిషాల్లోనే తాము పాఠశాలకు చేరుకున్నామని, అప్పటికే లైబ్రరీ, మెట్ల మార్గంలో మృతదేహాలు పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉందని వారు పేర్కొన్నారు.

మానసిక సమస్యలే కారణమా?
నిందితురాలి మానసిక పరిస్థితిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయని అధికారులు అంగీకరించారు. గతంలో ఆమె ఇంటి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, చట్టప్రకారం వాటి యజమాని కోరడంతో తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని వారు వివరించడం గమనార్హం. 

ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి
ఈ దారుణ ఘటనపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ పార్లమెంటులో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దేశానికి అత్యంత చీకటి రోజని, మాటలకు అందని విషాదమని ఆవేదన చెందారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు. "ఈ దుఃఖ సమయంలో కెనడా ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుంది" అని ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు. సాధారణంగా కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు అమల్లో ఉండే కెనడాలో ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఈ మారణకాండ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.


More Telugu News