Atchannaidu: పాత గణాంకాలతో వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి: అచ్చెన్నాయుడు

Atchannaidu Slams YSRCP Paytm Batches for False Propaganda
  • వైసీపీది తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అచ్చెన్నాయుడు ఫైర్
  • జగన్ పాలనలో రైతు కుటుంబం సగటు అప్పు రూ. 2.45 లక్షలకు చేరిందని విమర్శ
  • రైతు ఆత్మహత్యల్లో గత పాలనలో ఏపీ టాప్-3లో ఉందని ఆరోపణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు 2018-19 నాటి పాత గణాంకాలను చూపిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలోనే రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని తెలిపారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పందిస్తూ, "2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబం సగటు అప్పు రూ. 2.45 లక్షలకు చేరింది. దీంతో దేశంలోనే అత్యధిక రైతు రుణాలున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అంతేకాకుండా, ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం నిరంతరం టాప్-3లోనే ఉంది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది" అని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో పీఎం-ప్రణామ్ పథకం కింద రూ. 216 కోట్లు, 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' కింద రూ. 695 కోట్లు సాధించారని తెలిపారు. కొబ్బరి రైతులను ఆదుకునేందుకు రూ. 200 కోట్లతో ప్రాసెసింగ్ పార్కులు, కర్ణాటక తరహాలో ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి, పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ వ్యవసాయాన్ని పండగలా మారుస్తామని, 'అన్నదాత సుఖీభవ' నినాదంతో ప్రతి రైతుకు భరోసా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు.
Atchannaidu
YSRCP
Andhra Pradesh
farmers
agricultural loans
farmer suicides
Chandrababu Naidu
irrigation projects
Polavaram project
PM PRANAM scheme

More Telugu News