PAN Card: పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

దేశంలో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దాదాపు ఆరు దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పలు నిబంధనలను సులభతరం చేశారు. ముఖ్యంగా పాన్ కార్డు వినియోగానికి సంబంధించిన లావాదేవీల పరిమితుల్లో గణనీయమైన మార్పులు ప్రతిపాదించారు.

ఈ కొత్త చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే విడుదల చేసింది. వీటిపై ప్రజలు, నిపుణుల నుంచి ఈ నెల‌ 22 వరకు అభిప్రాయాలను స్వీకరించనుంది. అనంతరం తుది నిబంధనలను, ఐటీ ఫారాలను ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఈ ముసాయిదా ప్రకారం పలు ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేసే పరిమితులను సవరించారు.

కొత్తగా మారనున్న పాన్ నిబంధనలు ఇవే..
బ్యాంకు లావాదేవీలు: ప్రస్తుతం బ్యాంకులో ఒక్కసారి రూ. 50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు, అంతకుమించి మించి నగదు డిపాజిట్ చేసినప్పుడు లేదా విత్‌డ్రా చేసినప్పుడు మాత్రమే పాన్ కార్డు వివరాలు సమర్పించాలి.

వాహనాల కొనుగోలు: ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఉండేది. కొత్త విధానంలో మోటార్ సైకిళ్లతో సహా ఏ రకమైన వాహనం కొనుగోలు చేసినా దాని విలువ రూ. 5 లక్షలు దాటితేనే పాన్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

స్థిరాస్తి క్రయవిక్రయాలు: ఏదైనా స్థిరాస్తిని అమ్మినా, కొనుగోలు చేసినా, బహుమతిగా ఇచ్చినా ఆ ఆస్తి విలువ రూ. 20 లక్షలు దాటినప్పుడే  పాన్ వివరాలు అవసరం. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది.

ఇతర చెల్లింపులు: ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు లేదా బాంక్వెట్ హాళ్లలో చేసే చెల్లింపులు ఒకేసారి రూ. 1 లక్ష దాటితే పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 50,000గా ఉంది. అలాగే, ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్తగా ఖాతా తెరవాలంటే ప్రీమియంతో సంబంధం లేకుండా పాన్ తప్పనిసరి చేశారు.

వీటితో పాటు కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఉచిత భోజనం లేదా పానీయాల విలువ ఒక్కో మీల్‌కు రూ. 200 మించరాదని కూడా కొత్త చట్టంలో స్పష్టం చేశారు. ఈ మార్పుల ద్వారా పన్ను విధానంలో పారదర్శకత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
PAN Card
PAN card rules
Income Tax Act 2025
taxation
financial transactions
bank deposits
property transactions
vehicle purchase
tax rules
Nirmala Sitharaman

More Telugu News