Bird Flu: అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి

Annamayya District Bird Flu Outbreak Kills Thousands of Chickens
  • సదుం మండలంలోని మూడు గ్రామాల్లో 24 వేల కోళ్ల మృతి
  • భోపాల్ ల్యాబ్ పరీక్షల్లో వైరస్‌గా నిర్ధారించిన అధికారులు
  • ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
  • ఆందోళన వద్దు, జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులు
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది.

వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత కొన్ని రోజులుగా కోళ్లు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మరణించిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని స్పష్టమైందని, కంభంవారిపల్లె నివేదిక రావాల్సి ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై వెల్లడించారు.

ఈ పరిణామాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తమ ప్రాంతంలో కోళ్లు గానీ, ఇతర పక్షులు గానీ అసాధారణ రీతిలో మరణిస్తే వెంటనే 70139 14401 లేదా 93982 62752 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు.

కోడి మాంసం తినొచ్చా?.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
మరోవైపు బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు సోకే అవకాశాలు చాలా అరుదని స్పష్టం చేశారు. అయితే, మాంసాన్ని 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినడం సురక్షితమని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు కనీసం 10 రోజుల పాటు కోడిమాంసం, గుడ్లకు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.
Bird Flu
Annamayya District
Andhra Pradesh
Poultry
Avian Influenza
Nishant Kumar
Veterinary Department
Sadum Mandal
Poultry deaths
H9N2

More Telugu News