Saleem: 45 ఏళ్ల నాటి రూ.100 దొంగతనం కేసు.. తాజాగా చిక్కిన 65 ఏళ్ల వృద్ధుడు

1980 Wheat Theft Case Saleem Arrested After Decades
  • 45 ఏళ్ల నాటి రూ.100 విలువైన గోధుమల దొంగతనం కేసులో అరెస్ట్
  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన వింత ఘటన
  • ఇన్నేళ్లూ మరో జిల్లాలో తలదాచుకున్న నిందితుడు
  • పెండింగ్ కేసుల క్లియరెన్స్‌లో భాగంగా పోలీసుల చర్యలు
  • నిందితుడు సలీమ్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు
కాలం గడిచినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనడానికి ఈ ఘటనే నిదర్శనం. సరిగ్గా 45 ఏళ్ల క్రితం కేవలం రూ.100 విలువైన గోధుమలు దొంగిలించిన కేసులో 65 ఏళ్ల వృద్ధుడిని మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1980లో జరిగిన ఈ సంఘటనలో ఇన్నేళ్ల పాటు పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.

1980లో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా బల్కావాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సలీం (అప్పటి వయసు 20) మరో ఆరుగురితో కలిసి పొలంలోకి చొరబడి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించాడు. ఆ రోజుల్లో క్వింటాల్ గోధుమల ధర సుమారు రూ.115 ఉండేది. ఈ నేరం చేసిన వెంటనే సలీం తన కుటుంబంతో కలిసి గ్రామాన్ని విడిచి పక్కనే ఉన్న ధార్ జిల్లాకు పారిపోయాడు.

అక్కడ బాగ్ ప్రాంతంలో ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. తన పాత కేసు గురించి అందరూ మర్చిపోయి ఉంటారని, ఇక తనను ఎవరూ పట్టుకోలేరని భావించాడు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పాత నిందితుల జాబితాను పరిశీలిస్తున్నప్పుడు సలీం ఆచూకీ గురించి పోలీసులకు కీలక సమాచారం అందింది.

ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ధార్ జిల్లాలో నివసిస్తున్న సలీమ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేవలం వంద రూపాయల విలువైన చిన్న దొంగతనానికి 45 ఏళ్ల తర్వాత అరెస్ట్ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Saleem
Madhya Pradesh
wheat theft
Khargone district
1980 crime
Balakwada police station
Dhar district
pending cases
arrest

More Telugu News