భారత్‌తో మ్యాచ్ వివాదం.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 షరతులు!
- బంగ్లాదేశ్‌కు పరిహారం, పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని డిమాండ్
- భవిష్యత్తు ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్య హక్కులు కోరిన పాకిస్థాన్
- పీసీబీ ఛైర్మన్ మొండిపట్టు.. తుది నిర్ణయం కోసం ప్రధానితో భేటీ
నిన్న లాహోర్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పీసీబీ మూడు డిమాండ్లను ఉంచింది. టోర్నీ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం అందించాలని, టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ఏదైనా ఐసీసీ ఈవెంట్‌కు తమకు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ షరతులు పెట్టినట్లు సమాచారం.
కొలంబోలో ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీలోని కొందరు అధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ, బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదని సమాచారం. ఇవాళ ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మరోసారి సమావేశమై, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
భద్రతా కారణాలను చూపి తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో గత నెలలో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి, స్కాట్లాండ్‌ను చేర్చింది. అప్పటి నుంచి పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తోంది. ‘ఫోర్స్ మేజర్’ క్లాజ్‌ను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఆడబోమని చెప్పడంపై వివరణ ఇవ్వాలని ఐసీసీ కోరడంతో పీసీబీ వైఖరిలో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో అతికష్టం మీద గెలిచింది.