Siddipet Tiger: సిద్దిపేటలో పెద్దపులి బీభత్సం.. ఒక్కరోజే ఆరు పశువుల హతం!

Siddipet Tiger Terror Six Cattle Killed in a Day
షార్ట్స్‌లో చూడండి
సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఆరు పశువులను చంపేయడంతో పలు గ్రామాలు వణికిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, పులిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రానాయక్ తండాలో మలోత్ రమేశ్ అనే రైతుకు చెందిన ఐదు పశువులపై పులి దాడి చేసి చంపేసింది. ఇదే తరహాలో నంగునూరు మండలం ఘనాపూర్‌లో బాల్ రెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడను హతమార్చి, మరో పశువును గాయపరిచింది. శనివారం జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలంలోకి ప్రవేశించిన ఈ పులి, అక్కడి నుంచి నంగునూరు, కోహెడ మండలాల్లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు.

ఈ పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల మీదుగా వందల కిలోమీటర్లు ప్రయాణించి సిద్దిపేటకు చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. తనకంటూ ఒక కొత్త ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే ఇది పశువులపై దాడి చేస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాలకు చేరుకుని పులి పాదముద్రలను సేకరించారు. డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లతో పాటు మహారాష్ట్రలోని తడోబా, పుణె నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందాల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో కట్టివేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Siddipet Tiger
Tiger
Siddipet
Telangana
Forest Department
Cattle Killings
Wildlife
Nangunuru
Koheda
Rescue Operation

More Telugu News