Daggubati Purandeswari: అమెరికాతో భారత్ ఒప్పందంపై పురందేశ్వరి ట్వీట్

Daggubati Purandeswari Comments on India US Trade Deal
షార్ట్స్‌లో చూడండి
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశంలోని రైతులకు సంపూర్ణ భద్రత కల్పిస్తుందని బీజేపీ నేత, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ ఒప్పందం ద్వారా రైతు ప్రయోజనాలను కాపాడుతూనే, వ్యవసాయ ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం గోధుమ, బియ్యం, మక్కజొన్న, పప్పుధాన్యాలు వంటి ప్రధాన పంటలపై ఎలాంటి సుంకాల తగ్గింపులు లేదా కోటాలు లేవని పురందేశ్వరి స్పష్టం చేశారు. కాబూలీ శనగ, పచ్చి బఠాణీ వంటి వాటితో పాటు నారింజ, చిలగడదుంప వంటి ఉద్యాన పంటల రైతుల ప్రయోజనాలకు కూడా పూర్తి రక్షణ లభిస్తుందని ఆమె వివరించారు. దీనివల్ల లక్షలాది మంది రైతులకు ఆదాయ భరోసా కొనసాగుతుందని చెప్పారు.

మరోవైపు, ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో తయారైన ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో సులభంగా ప్రవేశం లభిస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఇది దేశీయ ఎగుమతులకు ఊతమిచ్చి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దృఢమైన నాయకత్వం వల్లే రైతు భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 

"భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం దేశీయ వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తోంది. ఎగుమతులకు కొత్త ఊపునిస్తూనే, దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేలా సమతుల్య విధానంతో ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఒప్పందం ప్రకారం, సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ ఎలాంటి సుంకాల రాయితీలు కానీ, మార్కెట్ యాక్సెస్ కానీ ఇవ్వలేదు. ముఖ్యంగా అరటి, మామిడి, సిట్రస్ పండ్లు, బెర్రీలు వంటి ఉద్యాన పంటలకు సంపూర్ణ రక్షణ కల్పించారు. దీంతో దిగుమతుల ఒత్తిడి లేకుండా రైతుల ఆదాయానికి భద్రత చేకూరనుంది. 

ఉల్లిపాయలు, మష్రూమ్స్, వెల్లుల్లి, బంగాళాదుంప, బఠాణీ, శనగలు, బీన్స్ వంటి ప్రధాన కూరగాయలన్నీ రక్షణ పరిధిలోనే ఉన్నాయి. విదేశీ పోటీ నుంచి దేశీయ రైతులకు భరోసా కల్పిస్తూ, ధరల స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆహార భద్రత, గ్రామీణ జీవనోపాధికి భంగం కలగకుండానే వాణిజ్యాన్ని వృద్ధి చేసే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది" అని వివరించారు.

Go Back to Shorts
Daggubati Purandeswari
India US trade deal
Indian farmers
Agriculture exports
Tariff reductions
Food security
Rural economy
Processed foods
Organic products
Horticulture

More Telugu News