వరల్డ్ కప్‌లో తొలి రోజే హ్యాట్రిక్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన విండీస్ ఆల్‌రౌండర్

  • టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు ఘనమైన ఆరంభం
  • ఒకే ఓవర్లో హ్యాట్రిక్‌తో సహా 4 వికెట్లు తీసిన రొమారియో షెపర్డ్
  • మొత్తం 5 వికెట్లతో స్కాట్లాండ్ పతనాన్ని శాసించిన విండీస్ ఆల్‌రౌండర్
  • బ్యాటింగ్‌లో హెట్‌మెయర్ అర్ధశతకంతో రాణించడంతో విండీస్ భారీ స్కోర్
  • స్కాట్లాండ్‌పై 35 పరుగుల తేడాతో గెలిచిన కరీబియన్ జట్టు
టీ20 ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభం కాగా, తొలిరోజే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో హ్యాట్రిక్‌తో సహా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నీలో శుభారంభం చేసింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మెయర్ (36 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. బ్రాండన్ కింగ్ (35), రోవ్‌మన్ పావెల్ (24) కూడా రాణించారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ను రొమారియో షెపర్డ్ తన బౌలింగ్‌తో కకావికలం చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన షెపర్డ్, రెండో బంతికి మాథ్యూ క్రాస్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి మైకేల్ లీస్క్ (0), నాలుగో బంతికి ఒలివర్ డేవిడ్‌సన్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అదే ఓవర్లో ఆరో బంతికి సఫ్యాన్ షరీఫ్ (0)‌ను ఔట్ చేసి నాలుగో వికెట్ పడగొట్టాడు. దీంతో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (42), టామ్ బ్రూస్ (35) పోరాడినప్పటికీ, షెపర్డ్ దెబ్బకు కోలుకోలేకపోయింది. అతనికి తోడుగా జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో గ్రూప్-సిలో వెస్టిండీస్ కీలకమైన రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.


More Telugu News