డబ్ల్యూపీఎల్ ఫైనల్... ఆర్సీబీకి భారీ టార్గెట్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్
- డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ ముందు 204 పరుగుల టార్గెట్
- అర్ధశతకంతో మెరిసిన ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్
- మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన వోల్వార్డ్ట్, హెన్రీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని దెబ్బతిన్న బెంగళూరు
- విఫలమైన ఆర్సీబీ బౌలర్లు
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ ముందుండి నడిపించింది. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి జట్టుకు కీలక స్కోరు అందించింది. ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ట్ (25 బంతుల్లో 44), ఓపెనర్ లిజెల్ లీ (30 బంతుల్లో 37) రాణించారు. ఆఖర్లో చినెల్ హెన్రీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ఢిల్లీ స్కోరు 200 పరుగులు దాటింది.
బెంగళూరు బౌలర్లలో లారెన్ బెల్ మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బెల్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీయలేకపోయింది. సయాలీ సత్ఘరే, అరుంధతి రెడ్డి, నడీన్ డి క్లర్క్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ, భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. శ్రేయాంక పాటిల్ రెండు ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ టైటిల్ కల నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.