Medico Death: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికో మృతి

Vijayawada Hospital Medical Student Deepika Found Dead
  • విధుల్లో ఉండగానే కడుపునొప్పితో బాధపడ్డ మెడికో
  • ఇంజెక్షన్ చేసిన సహచర విద్యార్థిని
  • అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్న యువతి
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించిన సహచరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..  

అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబీబీఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక.. విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే, బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు చెప్పింది. దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది.

ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్‌ గదిలో బల్లపై పడిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు.. దీపిక అప్పటికే మరణించిందని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

దీపికది అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామని, అనంతపురం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక వారి ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతామని చెప్పారు. వైద్య విద్యార్థిని దీపిక మరణంపై మంత్రి సత్యకుమార్‌ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

More Telugu News

Medico Death
Vijayawada
Government Hospital
Andhra Pradesh
Medical student death
Anesthesia PG student
Suspicious death
Medical college
Suicide investigation
Minister Satya Kumar