Tiger: యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పులి సంచారం.. అధికారులు ఏం చెప్పారంటే..!

Tiger Movement Creates Stir in Yadadri Bhuvanagiri and Janagama Districts
  • మహారాష్ట్ర నుంచి సిద్దిపేట జిల్లా మీదుగా యాదాద్రి జిల్లాకు వచ్చిన పులి
  • పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న అధికారులు
  • జనగామలో పులి సంచారం లేదని స్పష్టం చేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి ఈ పెద్దపులి వచ్చిందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ ప్రాంతంలో కనిపించిన పులి సంచారం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది. గత ఇరవై రోజుల్లో ఈ పులి పలు లేగదూడలను చంపింది. రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

మూటకొండూరు మండలంలో పులి ఆనవాళ్లను గుర్తించారు. రాత్రి మండలంలోని అనంతారంలో ఒక లేగదూడను చంపేసింది. మహారాష్ట్ర అడవుల్లో నుంచి తెలంగాణలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

కాగా, ఈ పులిని జాడను గుర్తించేందుకు ఆదిలాబాద్ నుంచి అనిమల్ ట్రాకర్స్ వచ్చినట్లు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిన్న తెలిపారు. ఈ పులి యాదాద్రి భువనగిరి నుంచి తిరిగి వెనక్కి వెళుతున్నట్లుగా అర్థమవుతోందని అన్నారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి మన ప్రాంతం నుంచి వెళ్లిపోయిందని స్పష్టమైన సమాచారం వచ్చే వరకు జాగరూకతగా ఉండాలని అన్నారు. పులి సంచారం నేపథ్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులది ప్రధాన బాధ్యత అన్నారు.

జనగామలో పులి సంచారం వార్తలపై సీఐ సత్యనారాయణ రెడ్డి

జనగామలో పులి సంచారం వార్తలపై సీఐ సత్యనారాయణ రెడ్డి స్పందించారు. పులి సంచారం వార్తలు అవాస్తవమని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ప్రచారం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. జనగామలోని వీవర్స్ కాలనీ, పసరపడ్ల, చంపక్‌హిల్స్ వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు డయల్ 100కు ఫోన్ చేసి ఆందోళన చెందుతున్నారని అన్నారు. అసత్య ప్రచారం కారణంగా వారు భయపడుతున్నారని తెలిపారు.

More Telugu News

Tiger
Yadadri Bhuvanagiri
Janagama
Tiger movement
Telangana forest
Forest department
Cattle kill