అసభ్యకర పదజాలంతో చంద్రహాస్ పాట.. స్పందించిన చిత్ర నిర్మాత

'బరాబర్ ప్రేమిస్తా' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినీ నటుడు చంద్రహాస్ పాడిన పాట వివాదాస్పదం కావడంతో చిత్ర దర్శక నిర్మాతలు, సినీ నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు. ఈ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన 'గుంజి గుంజి' పాటలో అసభ్య పదాలు ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటలో ఉపయోగించిన అసభ్యకర పదజాలంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు స్పందించారు.

పాటలో అసభ్యకర పదాలు దొర్లడంపై నిర్మాత చిన్ని విచారం వ్యక్తం చేశారు. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశంతో చంద్రహాస్ పాట పాడారని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. దాని గురించి ఈ ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. అతడు కావాలని చేయలేదని, అందుకు తాము బాధపడుతున్నామని అన్నారు. పాట పాడి కిందకు వచ్చిన తర్వాత అలా చేయకూడదని కూడా చెప్పినట్లు వెల్లడించారు.

చంద్రహాస్ పాటను అసభ్యకర పదాలతో పాడినందుకు చాలా బాధగా ఉందని దర్శకుడు సంపత్ రుద్ర అన్నారు. చిత్రంలో మాత్రం అలాంటి పాటలు లేవని స్పష్టం చేశారు.

స్పందించిన జేడీ చక్రవర్తి

చంద్రహాస్ పాట పాడే సమయంలో నటుడు జేడీ చక్రవర్తి అక్కడే ఉన్నప్పటికీ ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ పాటపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ, తాను ఈవెంట్ నుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయడం తప్పు కాదని, కానీ అవి మహిళలను కించపరిచేలా, అసభ్యకరంగా ఉండకూడదని అన్నారు.


More Telugu News