టెక్కీలకు శుభవార్త.. 25 వేల మంది ఫ్రెషర్ల నియామకానికి కాగ్నిజెంట్ ప్లాన్!

ఐటీ రంగంలో ఉద్యోగాల కోతపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ప్రముఖ దిగ్గజం కాగ్నిజెంట్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 2026 ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది గత ఏడాదితో (20,000 నియామకాలు) పోలిస్తే 20 శాతం అధికం కావడం విశేషం. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన టాలెంట్ పిరమిడ్‌ను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది.

సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే వాదనలు వినిపిస్తుంటాయి. అయితే, కాగ్నిజెంట్ దీనిని మరో కోణంలో చూస్తోంది. జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో జతకట్టి ఏఐ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవి కుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ల నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది.

ఆర్థిక ఫలితాల పరంగానూ కాగ్నిజెంట్ అదరగొట్టింది. 2025 డిసెంబరుతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 18.7 శాతం వృద్ధి చెంది 64.8 కోట్ల డాలర్లకు చేరింది. సెప్టెంబర్ నాటితో పోలిస్తే డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 1,800 పెరిగి మొత్తం 3.51 లక్షలకు చేరుకుంది. కేవలం మనుషుల శ్రమతోనే కాకుండా, డిజిటల్ లేబర్‌ను కూడా జోడించి 2026లో 2,266 కోట్ల డాలర్ల ఆదాయమే లక్ష్యంగా కాగ్నిజెంట్ ముందుకు సాగుతోంది. ఐటీ రంగం మందగమనంలో ఉందన్న వార్తల మధ్య కాగ్నిజెంట్ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 


More Telugu News