Nitin Nabin: తెలంగాణలో సనాతన ధర్మంపై జరిగే దాడులను సహించేది లేదు: నితిన్ నబీన్ హెచ్చరిక

Nitin Nabin Warns Against Attacks on Sanatana Dharma in Telangana
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన 'విజయ సంకల్ప్' సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాల భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడారని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తోందని అన్నారు. బలహీనవర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని ఆరోపించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని అన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,400 కోట్లకు పైగా కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్ రైళ్లను ఇచ్చామని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Nitin Nabin
Telangana
Sanatana Dharma
BJP
Hindu Temples
Congress
Muslim Vote Bank
Revanth Reddy

More Telugu News