Sanjay Kumar Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు లేవనడంపై స్పందించిన కేపీ వివేకానంద

Sanjay Kumar Jagtial MLA Party Change Allegations KP Vivekanand Reacts
  • సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో ఎందుకు చేర్చుకున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారన్న వివేకానంద
  • ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం
  • స్పీకర్ కాలయాపన చేస్తూ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ తమ పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు.

కానీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనర్హత పిటిషన్లపై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేవంటూ ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కూడా కుమ్మక్కయిందని ఆరోపించారు.

స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్ కు కనబడకపోవడం విచారకరమని అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, అది స్పీకర్‌కు కనపడటం లేదా అని నిలదీశారు. సభాపతి ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమేనని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ వదిలేసినా కోర్టుల్లో శిక్ష తప్పదని అన్నారు.

More Telugu News

Sanjay Kumar Jagtial
Jagtial MLA
K P Vivekanand
BRS MLA
Telangana Politics
Speaker Prasad Kumar