Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!

Chandrababu Naidu Welcomes Zero Tax on Raw Tobacco
  • అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం
  • బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ
  • ఫిబ్రవరి 1వ తేదీ నుంచే అమల్లోకి కొత్త రూల్స్
  • రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు, చిరు వ్యాపారుల దశాబ్దాల కల నెరవేరింది. ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల పొగాకు వాణిజ్యంలో పారదర్శకత పెరగడమే కాకుండా, సామాన్య రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో బ్రాండ్ లేని ముడి పొగాకు విక్రయాలపై సరైన నిబంధనలు లేకపోవడంతో అధికారులు, రైతుల మధ్య తరచూ వివాదాలు తలెత్తేవి. పన్ను ఎగవేత ఆరోపణలతో రైతులు ఇబ్బందులు పడేవారు. తాజా గెజిట్ (HS కోడ్ 2401) ద్వారా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

రైతులు సంచుల్లో విక్రయించే ముడి పొగాకు, ప్యాకింగ్ లేని రీటైల్ విక్రయాలపై ఎలాంటి పన్ను ఉండదు. కంపెనీ బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసిన పొగాకు, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మే ఉత్పత్తులపై మాత్రం 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుంది.

ముడి పొగాకు పేరుతో బ్రాండెడ్ ఉత్పత్తులను అక్రమంగా విక్రయించి పన్ను ఎగ్గొట్టే వారికి ఈ కొత్త మార్గదర్శకాలు అడ్డుకట్ట వేయనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ముడి పొగాకు సరఫరా వ్యవస్థలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎగుమతులు కూడా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనివల్ల ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని లక్షలాది మంది పొగాకు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.

ఈ నిర్ణయం వల్ల మార్కెట్ యార్డుల్లో పొగాకు కొనుగోళ్లు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు పన్ను భయం లేకుండా నేరుగా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేయవచ్చు. 

More Telugu News

Chandrababu Naidu
Andhra Pradesh
Tobacco farmers
Excise duty
Tax exemption
Raw tobacco
Guntur
Prakasam
Godavari districts
Tobacco exports