Donald Trump: ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ: 140 కోట్ల మంది భారతీయుల తరపున కృతజ్ఞతలు

Donald Trump Thanks From PM Modi For Tariff Reduction
  • భారత ఉత్పత్తులపై పన్ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
  • రష్యా ఆయిల్‌కు స్వస్తి.. అమెరికా చమురుకు ఓకే
  • అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు భారత్ హామీ
  • మోదీ-ట్రంప్ మధ్య 30 నిమిషాల కీలక ఫోన్ కాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత వస్తువులపై దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ప్రధాని మోదీ స్పందించారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్‌కు 'బిగ్ థాంక్స్' చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

"నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ రోజు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకం 18 శాతానికి తగ్గడం గొప్ప విషయం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం. ఆయన శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది" అని ప్రధాని పేర్కొన్నారు.

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఈ ఒప్పందానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు

చమురు దౌత్యం: భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనదు. దానికి బదులుగా అమెరికా, వెనిజువెలా నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు.
భారీ కొనుగోళ్లు: అమెరికా నుంచి బొగ్గు, గ్యాస్, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు సహా మొత్తం 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది.
టారిఫ్ బెనిఫిట్: రష్యా ఆయిల్‌ను కొంటున్నందుకు భారత్‌పై గతంలో విధించిన అదనపు 25 శాతం శిక్షాత్మక పన్నును ట్రంప్ పూర్తిగా రద్దు చేశారు.

సుంకాల ప్రయాణం: గతేడాది నుంచి ఇప్పటివరకు..
ఏప్రిల్ 2, 2025: భారత్‌పై 26 శాతం 'రెసిప్రోకల్ టారిఫ్' విధింపు.
ఏప్రిల్ 10, 2025: 90 రోజుల పాటు సుంకాలపై స్టే.
జూలై 31, 2025: రష్యా ఆయిల్ కొనుగోలుపై ఆగ్రహించిన ట్రంప్.. 25 శాతం పన్ను విధింపు.
ఆగస్టు 7, 2025: రష్యా నుంచి చమురు ఆపనందుకు సుంకాన్ని ఏకంగా  50 శాతానికి పెంపు (అమెరికా భాగస్వాముల్లో భారత్‌కే అత్యధిక పన్ను).
ఫిబ్రవరి 2, 2026: తాజా ఒప్పందం ప్రకారం సుంకం 18 శాతానికి తగ్గింపు.

అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఈ ఒప్పందాన్ని "చారిత్రాత్మక తొలి అడుగు"గా అభివర్ణించింది. ఈ నిర్ణయంతో అమెరికా మార్కెట్‌లో భారతీయ టెక్స్‌టైల్స్, జెమ్స్, జువెలరీ, ఇంజనీరింగ్ వస్తువులకు డిమాండ్ భారీగా పెరగనుంది. రష్యా నుంచి ఆయిల్ ఆగిపోతే దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగకుండా, అమెరికా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 
Donald Trump
Narendra Modi
India
United States
Trade Tariffs
Import Duties
Russia Ukraine War
Crude Oil
US India Relations
Trade Agreement

More Telugu News