Buddha Venkanna: పవన్ తల్లిని తిట్టినప్పుడు ఏమయ్యారు?.. ఆ రోజు మీ కులం గుర్తుకు రాలేదా?: ముద్రగడపై బుద్ధా వెంకన్న ఫైర్

Buddha Venkanna Fires at Mudragada on Abusing Pawan Kalyans Mother
  • ముద్రగడకు కౌంటర్‌గా టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ
  • అవసరమైనప్పుడే కులం గుర్తుకొస్తుందా? అని సూటి ప్రశ్న
  • పవన్ కల్యాణ్, నారాయణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీత
  • జగన్ హయాంలో చంద్రబాబుపై దాడులను ఎందుకు ఖండించలేదని విమర్శ
  • చంద్రబాబుపై అసూయతోనే ముద్రగడ లేఖలు రాస్తున్నారని ఆరోపణ
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను ఉద్దేశించి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ముద్రగడ తీరును ఎండగడుతూ ఆయనకు కౌంటర్‌గా బహిరంగ లేఖను విడుదల చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే కులం గురించి మాట్లాడతారా? ఇదేనా మీ తండ్రి మీకు చెప్పింది? అంటూ ముద్రగడను సూటిగా ప్రశ్నించారు.

తన లేఖలో బుద్ధా వెంకన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ ముద్రగడపై ప్రశ్నల వర్షం కురిపించారు. "కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ తల్లిని, భార్యను వైసీపీ నేతలు దారుణంగా దూషించినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా? కాపు నేత అయిన నారాయణపై తప్పుడు కేసులు పెట్టి వేధించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని నిలదీశారు. తనకు అండగా నిలిచింది గవర సామాజికవర్గమని చెప్పే ముద్రగడ, అదే సామాజికవర్గానికి చెందిన తనపై మాచర్లలో హత్యాయత్నం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

1994లో ఎన్నికల్లో ఓడిపోయిన ముద్రగడను, 1999లో చంద్రబాబే పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆ రోజు చంద్రబాబును గొప్ప వ్యక్తిగా ప్రశంసించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు అర్ధాంగిని అసెంబ్లీలో అవమానించినప్పుడు, ఆయన ఇంటిపై జోగి రమేశ్‌ దాడి చేసినప్పుడు జగన్‌కు ఎందుకు లేఖ రాయలేదని విమర్శించారు. అంబటి రాంబాబు వాడిన బూతులను ముద్రగడ సమర్థిస్తున్నారా? అని నిలదీశారు.

"చంద్రబాబుపై మీకెందుకో చెప్పలేని ద్వేషం, అసూయ. మీలాంటి వాళ్లు ఎంత అసూయపడితే ఆయన అంత ఎదుగుతారు. ఆయన ఒక కులానికో, మతానికో నాయకుడు కాదు, ప్రపంచం గుర్తించిన నేత. అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు జరిగాయి. అందుకే ప్రజలు మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేశారు. ఇకనైనా అసూయతో కాకుండా వాస్తవాలు రాయండి" అంటూ బుద్ధా వెంకన్న తన లేఖలో హితవు పలికారు.
Buddha Venkanna
Mudragada Padmanabham
Chandrababu Naidu
Nara Lokesh
TDP
YSRCP
Andhra Pradesh Politics
Kapu Community
Pawan Kalyan
Ambati Rambabu

More Telugu News