భారత శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. ఒకే పరికరంతో సౌరశక్తి సంగ్రహణ, నిల్వ

  • భారత శాస్త్రవేత్తల నుంచి కొత్త సౌరశక్తి పరికరం ఆవిష్కరణ
  • సౌరశక్తిని సంగ్రహించి, నిల్వ చేసే సింగిల్-యూనిట్ టెక్నాలజీ
  • సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే ఖర్చు, శక్తి నష్టాలు గణనీయంగా తక్కువ
  • నికెల్-కోబాల్ట్ ఆక్సైడ్ నానోవైర్లతో తయారైన ఈ పరికరం ఎంతో సమర్థవంతం
  • గ్రిడ్ లేని మారుమూల ప్రాంతాల్లో వినియోగానికి అత్యంత అనుకూలం
క్లీన్ ఎనర్జీ రంగంలో భారత శాస్త్రవేత్తలు ఒక కీలక మైలురాయిని సాధించారు. సౌరశక్తిని గ్రహించడంతో పాటు దానిని నిల్వ చేయగల పరికరాన్ని (సింగిల్ యూనిట్) అభివృద్ధి చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ)కి చెందిన బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ పరిశోధకులు ఈ ఘనత సాధించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సాధారణంగా సోలార్ సిస్టమ్స్‌లో శక్తిని గ్రహించడానికి, నిల్వ చేయడానికి వేర్వేరు యూనిట్లు అవసరమవుతాయి. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు శక్తి నష్టం కూడా జరుగుతుంది. అయితే, ఈ కొత్త పరికరంతో ఆ రెండు పనులూ ఒకే యూనిట్‌లో జరిగిపోతాయి. 'ఫోటో-రీఛార్జబుల్ సూపర్ కెపాసిటర్'గా పిలిచే ఈ పరికరం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా సామర్థ్యం కూడా పెరుగుతుంది.

నికెల్-కోబాల్ట్ ఆక్సైడ్ (NiCo2O4) నానోవైర్ల సహాయంతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేక నిర్మాణం వల్ల ఇది సూర్యరశ్మిని గ్రహించడంతో పాటు విద్యుత్‌ను నిల్వ చేసుకునే సూపర్ కెపాసిటర్ ఎలక్ట్రోడ్‌గానూ పనిచేస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించినప్పుడు, ఈ పరికరం 1.2 వోల్టుల స్థిరమైన అవుట్‌పుట్‌ను ఇచ్చింది. 1000 సార్లు ఫోటో-ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా 88 శాతం సామర్థ్యాన్ని నిలుపుకుంది. తక్కువ వెలుతురు నుంచి తీవ్రమైన సూర్యరశ్మి వరకు అన్ని పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ఆవిష్కరణతో పోర్టబుల్, వేరబుల్ పరికరాలతో పాటు విద్యుత్ గ్రిడ్ లేని మారుమూల ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో, పర్యావరణహితంగా విద్యుత్‌ను అందించే మార్గం సుగమమైంది. శిలాజ ఇంధనాలు, సంప్రదాయ బ్యాటరీలపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.


More Telugu News