Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం!

Record Drop in Gold and Silver Rates
  • తులం బంగారంపై ఒక్కరోజే రూ.9,050 పతనం
  • కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గుదల
  • లాభాల స్వీకరణతోనే తగ్గుతున్నాయని అంచనా
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్ఠ‌ స్థాయికి చేరిన తర్వాత, గత నాలుగైదు రోజులుగా పసిడి, వెండి ధరలు నేలచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ‌ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ ఇవ్వగా, కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.

ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం 9:30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.9,050 తగ్గి రూ.1,51,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.8,300 తగ్గి రూ.1,38,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,680గా నమోదైంది.

ప‌సిడి బాటలోనే వెండి
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.50,000 పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద ఉంది. కొద్ది రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4.25 లక్షల వరకు చేరడం గమనార్హం.

ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరడంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పతనం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తుండగా, కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిస్తోంది.
Gold Price
Gold
Silver Price
Silver
Hyderabad
Delhi
Commodity Market
Investment
Price Drop
Profit Booking

More Telugu News