పాక్‌కు ఐసీసీ ‘అల్టిమేటం’: ఆడకపోతే రూ. 280 కోట్లు కట్!

  • భారత్‌తో మ్యాచ్‌ ఆడేది లేదన్న పాక్‌పై ఐసీసీ సీరియస్
  • ఆదాయంలో భారీ కోత తప్పదని హెచ్చరిక
  • బాయ్‌కాట్‌పై వెనక్కి తగ్గాలని సూచన
  • మొండికేస్తే పాయింట్లు కోల్పోవడం ఖాయం
టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. తమ ఇష్టానుసారం కొన్ని మ్యాచ్‌లు ఆడి, మరికొన్ని ఆడబోమనడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మొండివైఖరిని వీడకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అందాల్సిన వార్షిక ఆదాయం సుమారు 34.5 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 280 కోట్లు) నిలిపివేస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వాలు విదేశీ విధానాలను నిర్ణయించుకోవచ్చు కానీ, ఒక గ్లోబల్ టోర్నీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం టోర్నీ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఐసీసీ పేర్కొంది. అన్ని జట్లు సమాన నిబంధనలకు లోబడి ఆడాల్సిందేనని, పాక్ తీరు వల్ల క్రీడా ప్రపంచంలో ఆ దేశ ప్రతిష్ఠ మసకబారుతుందని హెచ్చరించింది.

ఒకవేళ ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌కు పాక్ రాకపోతే, నిబంధనల ప్రకారం పాకిస్థాన్ 20 ఓవర్ల ఇన్నింగ్స్ పూర్తి చేసినట్టుగా భావిస్తారు. వికెట్లు పడకపోయినా రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల గ్రూప్ దశలో పాక్ సెమీస్ అవకాశాలు గాలిలో దీపంలా మారుతాయి.

ఐసీసీ వార్నింగ్ ఇస్తున్నా బీసీసీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ప్రోటోకాల్ ప్రకారం టీమిండియా నిర్ణీత సమయానికి స్టేడియానికి చేరుకుంటుంది. పాక్ జట్టు రాకపోతే మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఐసీసీ ఉన్నతాధికారులు పాక్ బోర్డుతో చర్చలు జరిపే అవకాశం ఉంది. పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేక భారీ జరిమానాకు సిద్ధపడుతుందో వేచి చూడాలి.


More Telugu News