KCR: కేసీఆర్ నివాసంలోకి డాక్యుమెంట్లతో వెళ్లిన సిట్ అధికారులు... మొదలైన విచారణ

KCR Questioned by SIT Officials in Phone Tapping Case
షార్ట్స్‌లో చూడండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆదివారం మధ్యాహ్నం పలు డాక్యుమెంట్లతో హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సిట్ అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు.

ఈ విచారణ కోసం కేసీఆర్ ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. విచారణకు సిట్ అధికారులు పూర్తి సన్నద్ధతతో రాగా, కేసీఆర్ కూడా తన వెంట ఒక నోట్‌బుక్, కొన్ని ముఖ్యమైన పత్రాలను తెచ్చుకున్నారు. సిట్ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. కేసీఆర్ వెంట మాజీ ఎంపీ సంతోశ్ రావు ఉండేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సిట్‌కు తెలియజేసినట్లు సమాచారం.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులతో సహా దాదాపు 600 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధికారులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుతో పాటు, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. పలువురు పోలీసు అధికారులను అరెస్టు కూడా చేసింది.


Go Back to Shorts
KCR
KCR phone tapping case
Telangana phone tapping
BRS phone tapping
Reethiraj DCP Madhapur
KTR
Harish Rao
Telangana politics
illegal phone tapping
SI investigation

More Telugu News