Farmers welfare: బడ్జెట్: రైతులకు నిర్మలమ్మ తీపి కబురు

Nirmala Sitharaman announces good news for farmers in budget
  • చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు
  • చేపల పెంపకం, పశు సంవర్థక శాఖలో భారీ ప్రోత్సాహకాలు
  • తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంచే రైతులకు ఊతం
కేంద్ర బడ్జెట్ లో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్‌ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్, వ్యవసాయ రంగ వృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసింది. పంటలపైనే కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుపోషణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు. 'వికసిత భారత్ 2047' లక్ష్య సాధనలో భాగంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ రెండు రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం స్పష్టం చేసింది.

మత్స్య రంగానికి సమగ్ర చేయూత

దేశ వ్యవసాయ జీడీపీలో, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా, 500 జలాశయాలు, 'అమృత్ సరోవర్'లను సమీకృతంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ జలాశయాలు ఒకవైపు సాగునీటి అవసరాలు తీరుస్తూనే, మరోవైపు చేపల పెంపకానికి అనువుగా మారనున్నాయి. తద్వారా భూమిలేని, సన్నకారు రైతులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. 

ముఖ్యంగా తీర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FFPOs) భాగస్వామ్యం చేసి విలువ గొలుసును (value chain) పటిష్టం చేయనున్నారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్రణాళిక దోహదపడుతుంది.

చేపల ల్యాండింగ్ కేంద్రాలు, కోల్డ్ చైన్‌లు, ప్రాసెసింగ్ సౌకర్యాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా మత్స్యకారులకు మెరుగైన ధర లభించేలా చర్యలు చేపట్టనున్నారు. సముద్ర వాణిజ్యంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, భారత ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ), అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకలు పట్టుకున్న చేపలను భారత ఓడరేవులకు తీసుకొస్తే సుంకం లేకుండా పరిగణిస్తారు. అదే సమయంలో, వాటిని విదేశీ పోర్టులకు తరలిస్తే ఎగుమతులుగా భావిస్తారు. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన సముద్ర ఉత్పత్తుల విలువలో సుంకం లేని ముడిసరుకుల దిగుమతి పరిమితిని 1% నుండి 3%కి పెంచారు.

పశుపోషణతో గ్రామీణ ఉపాధి

రైతుల ఆదాయాన్ని పెంచడంలో పశుపోషణ రంగాన్ని మరో కీలకమైన అస్త్రంగా ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు పలు చర్యలను ప్రకటించారు. పశుపోషణ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాడి, పౌల్ట్రీ, సంబంధిత కార్యకలాపాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సులభంగా ప్రారంభించి, విస్తరించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. తద్వారా ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించవచ్చు.

పశుపోషణ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంపై కూడా బడ్జెట్‌లో దృష్టి సారించారు. మెరుగైన పశు ప్రజనన కేంద్రాలు, మేలైన దాణా వ్యవస్థలు, పశు ఆరోగ్య సేవలు, ఉన్నతమైన కోల్డ్ చైన్ లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ ఆధునికీకరణతో పశుపోషణను కేవలం జీవనాధారం నుండి వ్యవస్థీకృత, మార్కెట్-ఆధారిత వ్యాపారంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాడి, పౌల్ట్రీ రంగాలలో సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం ద్వారా సామర్థ్యాన్ని పెంచి, వ్యర్థాలను తగ్గించి, రైతులకు అదనపు విలువలో ఎక్కువ వాటా దక్కేలా చూడనున్నారు.





Farmers welfare
Agriculture budget
Nirmala Sitharaman
Union Budget 2024
Coconut production
Cashew production
Fisheries development
Sandalwood farming
Horticulture sector

More Telugu News