కొడుకు కోసం వెతుకుతూ.. ఆకలి, చలితో రోడ్డుపైనే తల్లి మృతి!

  • నారాయణపేట జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన  వడ్డె చంద్రమ్మ  
  • అనారోగ్యంతో ఉన్న కొడుకు వెంకటేశ్‌ను చూసేందుకు బండ్లగూడకు రాక
  • అడ్రస్ మర్చిపోయి 4 రోజులుగా పస్తులు.. చలికి తట్టుకోలేక మృతి
  • బండ్లగూడ కాళీమందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు
నారాయణపేట జిల్లాకు చెందిన వడ్డె చంద్రమ్మకు తన కొడుకు వెంకటేశ్‌కు ఒంట్లో బాలేదని తెలిసింది. కన్నప్రేమ ఆగలేదు.. ఈ నెల 25న పల్లె నుంచి హైదరాబాద్ బండ్లగూడలోని కొడుకు ఇంటికి బయలుదేరింది. తల్లి వస్తున్న విషయాన్ని తండ్రి రాములు కొడుకుకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ, ఆ తల్లి మాత్రం కొడుకు ఇంటికి చేరలేదు.

నగరానికి వచ్చిన చంద్రమ్మ కొడుకు ఇంటి దారి మర్చిపోయింది. చేతిలో ఫోన్ లేక, ఎవరిని అడగాలో తెలియక నాలుగు రోజుల పాటు బండ్లగూడ వీధుల్లోనే తిరిగింది. ఆకలి వేసినా ఎవరినీ అడగలేక, రాత్రిపూట చలిని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఆమె కోసం కూతురు, కోడలు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభించలేదు.

గురువారం నాడు బండ్లగూడ కాళీమందిర్ సమీపంలోని ఓ పూల బండి వద్ద ఓ వృద్ధురాలు పడి ఉండటాన్ని చూసి జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసేసరికి, తాము వెతుకుతున్న చంద్రమ్మ విగతజీవిగా పడి ఉంది. కొడుకును చూద్దామని వచ్చిన తల్లి, ఇలా శవమై కనిపించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News