అరుణాచల కొండపై బుల్లితెర నటుల అతి.. అటవీశాఖ సీరియస్

  • నిషేధం ఉన్నా అన్నామలై గిరి ఎక్కిన నటి అర్చనా రవిచంద్రన్, అరుణ్ ప్రసాద్
  • కొండపై దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో బయటపడ్డ వ్యవహారం
  • ఒక్కొక్కరికి రూ. 5 వేలు పెనాల్టీ విధించిన అటవీశాఖ అధికారులు
ఆధ్యాత్మిక క్షేత్రం అరుణాచలంలో నిబంధనలు ఉల్లంఘించిన బుల్లితెర నటులకు అటవీశాఖ షాక్ ఇచ్చింది. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా వెళ్లినందుకు గానూ నటి అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్‌లకు జరిమానా విధించింది.

ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక ఉండే 2,668 అడుగుల అన్నామలై గిరిపైకి వెళ్లడంపై అటవీశాఖ నిషేధం అమల్లో ఉంది. కేవలం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ వీరిద్దరూ కొండ ఎక్కారు. అక్కడ దిగిన ఫోటోలను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వివాదం మొదలైంది.

దీనిపై స్పందించిన అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టి, అక్రమంగా కొండ ఎక్కినందుకు గానూ ఇద్దరికీ చెరో రూ. 5 వేల జరిమానా విధించారు. సెలబ్రిటీ హోదాలో ఉండి నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

అన్నామలై కొండ అటవీశాఖ రక్షిత ప్రాంతం కిందకు వస్తుంది. ఇక్కడ అరుదైన వనమూలికలతో పాటు వన్యప్రాణులు ఉంటాయి. ఏటా కార్తీక దీపం నాడు మాత్రమే అత్యంత పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో అనుమతి లేకుండా వెళ్లడం శిక్షార్హమైన నేరం.


More Telugu News