Donald Trump: హర్మూజ్ రక్షణకు రండి.. సౌత్ కొరియా, జపాన్ నౌకలకు ట్రంప్ పిలుపు

Trump Urges South Korea Japan Naval Support for Hormuz Security
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న తరుణంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన ఈ జలసంధిని తిరిగి తెరిపించి, నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు సౌత్ కొరియా, జపాన్ వంటి మిత్రదేశాలు తమ యుద్ధనౌకలను పంపాలని ఆయన కోరారు. ఈమేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందే దేశాలన్నీ ఈ మార్గపు రక్షణ బాధ్యతను పంచుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘‘చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు ఈ కృత్రిమ అడ్డంకుల వల్ల ప్రభావితమవుతున్నాయి. అందుకే ఆయా దేశాలు తమ యుద్ధనౌకలను ఇక్కడికి పంపాలని కోరుతున్నాను. దీనివల్ల ఇరాన్ నుంచి ముప్పు తప్పుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము 100 శాతం దెబ్బతీశామని, అయితే ఆ దేశం ఇప్పటికీ డ్రోన్లు లేదా క్షిపణులతో నౌకలను అడ్డుకునే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరించారు.

జలసంధిని సురక్షితంగా మార్చేందుకు అమెరికా తన వంతుగా తీరప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తుందని, ఇరాన్ నౌకలను నీట ముంచుతుందని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. "ఏదో ఒక రకంగా హర్మూజ్ జలసంధిని త్వరలోనే తెరుస్తాం, అది సురక్షితంగా మారుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో తమ యుద్ధనౌకలను పంపడంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Donald Trump
Hormuz Strait
Iran
South Korea
Japan
oil tankers
maritime security
Middle East
Persian Gulf
international relations

More Telugu News