ప్లాస్టిక్‌తో పెను ముప్పు.. 2040 నాటికి రెట్టింపు ఆరోగ్య సమస్యలు

  • ప్రతిష్ఠాత్మక లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం
  • ఉత్పత్తి దశ నుంచే గ్రీన్‌హౌస్ వాయువులు, విష రసాయనాల విడుదల
  • అనవసర ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడమే మార్గమని సూచన
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికే కాకుండా, మానవ ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రస్తుత పద్ధతుల్లో ఎటువంటి మార్పులు తీసుకురాకపోతే 2040 నాటికి ప్లాస్టిక్ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ఆరోగ్య సమస్యలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని ఇవాళ ప్రచురితమైన ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక 'ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ప్లాస్టిక్ తయారీకి ముడిసరుకులైన శిలాజ ఇంధనాల వెలికితీత నుంచి, ఉత్పత్తి, వినియోగం, పారవేయడం వరకు ప్రతి దశలోనూ ఆరోగ్యానికి హాని కలుగుతున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. గ్రీన్‌హౌస్ వాయువులు, గాలిని కలుషితం చేసే కణాలు, విష రసాయనాలు ప్రధానంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియల నుంచే విడుదలవుతున్నాయని తెలిపింది. ప్రస్తుత విధానాలే కొనసాగితే, 2040 నాటికి ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాల్లో 40 శాతం గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల, 32 శాతం వాయు కాలుష్యం వల్ల, 27 శాతం విష రసాయనాల వల్ల సంభవిస్తాయని పరిశోధకులు అంచనా వేశారు.

లండన్ స్కూల్‌కు చెందిన పరిశోధకురాలు మేగన్ డీనీ మాట్లాడుతూ.. "ప్లాస్టిక్ జీవిత చక్రంలో వెలువడే ఉద్గారాలు క్యాన్సర్లు, ఇతర అసంక్రమిత వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ఉత్పత్తి, దానిని బహిరంగంగా కాల్చడం వల్లే ఎక్కువ హాని జరుగుతోంది" అని వివరించారు. కేవలం వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ మెరుగుపరచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, దీనికి బదులుగా అనవసరమైన ప్లాస్టిక్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, కఠిన నిబంధనలు అమలు చేయాలని పరిశోధకుల బృందం ప్రభుత్వాలకు సూచించింది.


More Telugu News