భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందన

  • శుద్ధిచేసిన చమురును భారత నుంచి యూరోపియన్ దేశాలు కొనుగోలు చేస్తూ తమపై జరుగుతున్న యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయన్న బెసెంట్ 
  • ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ముగింపు పలుకుతామని వెల్లడి
  • భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లు సగానికి తగ్గే అవకాశం ఉందన్న బెసెంట్
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కొలిక్కి వచ్చిన నేపథ్యంలో అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించాం. కానీ ఏమైంది? యూరోపియన్ దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యన్ చమురు ముందుగా భారత్‌కు వస్తోంది. అక్కడ శుద్ధి అయిన తర్వాత ఆ ఉత్పత్తులను యూరోపియన్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. ఇలా చేస్తూ తమపై జరుగుతున్న యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నారు' అని బెసెంట్ విమర్శించారు.

ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ముగింపు పలుకుతామని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే భారీ త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ త్యాగాల వివరాలను ఆయన వెల్లడించలేదు. 

భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లు సగానికి తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలను బీసెంట్ ఇటీవల ఇచ్చిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుందని చెబుతూ, దానిని తమ పెద్ద విజయంగా పేర్కొన్నారు. చమురు విషయంలో టారిఫ్‌లు ఇంకా అమల్లో ఉన్నాయని, వాటిని తొలగించే మార్గం ఉందని భావిస్తున్నానని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. 


More Telugu News