ఇరాన్‌పై దాడికి అమెరికా రంగం సిద్ధం?.. మధ్యప్రాచ్యంలో భారీగా మోహరించిన యుద్ధనౌకలు

  • మధ్యప్రాచ్య జలాల్లోకి 'అబ్రహం లింకన్' ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్
  • ఇరాన్‌పై ఏ క్షణమైనా వైమానిక దాడులకు  ట్రంప్ ఆదేశం?
  • విమాన వాహక నౌకతో పాటు అత్యాధునిక యుద్ధనౌకల రాకతో పెరిగిన యుద్ధ వాతావరణం
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన నౌకాదళ శక్తిని భారీగా మోహరించింది. అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తిమంతమైన 'అబ్రహం లింకన్' ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇప్పటికే మధ్యప్రాచ్య సముద్ర జలాల్లోకి చేరుకుంది. ఈ ఆకస్మిక పరిణామంతో అగ్రరాజ్యం ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యుద్ధనౌకల మోహరింపును గమనిస్తే టెహ్రాన్‌లోని కీలక స్థావరాలపై వైమానిక దాడులు జరిపేందుకు వైట్‌హౌస్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇరాన్ అణు కార్యకలాపాలు లేదా ప్రాంతీయ అస్థిరతకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ భారీ మోహరింపు జరిగినట్లు సమాచారం.

కేవలం విమాన వాహక నౌక మాత్రమే కాకుండా క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం ఉన్న విధ్వంసక నౌకలు, క్రూయిజర్లు కూడా ఈ బృందంలో ఉన్నాయి. మరోవైపు, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రాంతీయ జలాల్లోకి విదేశీ బలగాల రాకను సహించబోమని, అవసరమైతే ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.  


More Telugu News