ఎస్ఏ20 లీగ్‌లో సన్ రైజర్స్ మూడోసారి ట్రోఫీ గెలిచాక కావ్యా పాప ఆనందం చూడండి!

  • సన్‌రైజర్స్ గెలుపుతో భావోద్వేగానికి గురైన కావ్య మారన్
  • SA20 లీగ్‌లో మూడోసారి టైటిల్ నెగ్గిన ఈస్టర్న్ కేప్
  • ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు
  • అద్భుత అర్ధ సెంచరీలతో ఆదుకున్న స్టబ్స్, బ్రీట్జ్కే
  • ప్రిటోరియా బ్యాటర్ బ్రెవిస్ సెంచరీ వృథా
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు మరోసారి టైటిల్ గెలవడంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ ఆనందంలో మునిగిపోయారు. ఫైనల్ మ్యాచ్‌లో జట్టు విజయం సాధించగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కళానిధి మారన్‌ను గట్టిగా హత్తుకుని తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం మైదానంలోకి పరుగెత్తుకెళ్లి ఆటగాళ్లను అభినందిస్తూ కేరింతలు కొట్టారు. మూడు వేళ్లు చూపిస్తూ జట్టు మూడో టైటిల్‌ను సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన SA20 2025-26 సీజన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలిచింది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో SA20 లీగ్ నాలుగు ఎడిషన్లలో మూడుసార్లు టైటిల్ గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (101) అద్భుత సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే, మార్కో జాన్సెన్ (3/10) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట సమయంలో మాథ్యూ బ్రీట్జ్కే (68*), ట్రిస్టన్ స్టబ్స్ (63*) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి ఓవర్లో స్టబ్స్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. 19.2 ఓవర్లలోనే సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది.

SA20 క్రికెట్ లీగ్ ను 2023 నుంచి నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లు జరిగాయి. 2023, 2024లో సన్ రైజర్స్ విజేతగా నిలిచింది. 2025 సీజన్ లోనూ ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్ రన్నరప్ గా సరిపెట్టుకుంది. తాజాగా, మూడోసారి టైటిల్ అందుకుంది. 


More Telugu News