ఇస్రో మరో భారీ ముందడుగు.. భారతీయ అంతరిక్ష కేంద్రం పనులకు శ్రీకారం

  • సొంత అంతరిక్ష కేంద్రం పనులను అధికారికంగా ప్రారంభించిన ఇస్రో
  • 2028 నాటికి తొలి మాడ్యూల్‌ను ప్రయోగించాలని లక్ష్యం
  • 'భారతీయ అంతరిక్ష స్టేషన్'గా ఈ ప్రాజెక్టుకు నామకరణం
  • 2035 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న కేంద్రం
  • పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా నిర్మాణం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసే పనులను అధికారికంగా ప్రారంభించింది. 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (BAS)గా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) తొలి కోర్ మాడ్యూల్ (BAS-01) తయారీ కోసం అర్హత కలిగిన భారత ఏరోస్పేస్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (Expression of Interest) ఆహ్వానించింది. 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ధ్రువీకరించారు. కేంద్ర కేబినెట్ 2024 సెప్టెంబర్‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌కు ఆమోదం తెలిపింది.

ఈ స్పేస్ స్టేషన్‌ను భూమికి 400-450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిమ్న భూ కక్ష్య (Low Earth Orbit)లో ప్రవేశపెడతారు. పూర్తయ్యే నాటికి ఇది 52 టన్నుల బరువు ఉంటుందని, ఒకేసారి నలుగురు వ్యోమగాములు 3-6 నెలల పాటు నివసించేందుకు వీలుగా ఉంటుందని అంచనా. గగన్‌యాన్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ కేంద్రాన్ని మాడ్యూళ్ల రూపంలో నిర్మించి, దశలవారీగా అంతరిక్షంలో కలుపుతారు. తొలి మాడ్యూల్‌ను LVM3 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును పూర్తిగా దేశీయంగానే నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తుంది.


More Telugu News