Danam Nagender: నేను అసలు కాంగ్రెస్ సభ్యత్వమే తీసుకోలేదు: కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్

Khairatabad MLA Danam Nagender Responds to KTRs Allegations
  • పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానంకు క్లీన్ చిట్
  • తాను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదన్న దానం
  • పార్టీ విప్‌ను కూడా ఉల్లంఘించలేదని వ్యాఖ్య

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు రాజకీయ దుమారం రేపుతున్న వేళ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందిస్తూ, తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.



"ముఖ్యమంత్రి పదవి పోయిందని కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పదవి తమ ఆస్తి అని కొందరు భ్రమపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా సీఎంను డీమోరలైజ్ చేయడం వారి వల్ల కాదు" అని దానం ఎద్దేవా చేశారు. అసలు నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు.


తాను కేవలం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని, ఎక్కడా అధికారికంగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని దానం వెల్లడించారు. శాసనసభలో పార్టీ విప్‌ను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని గుర్తు చేశారు. ఒకవేళ స్పీకర్ తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా, యుద్ధ రంగం నుండి వచ్చిన వాడిలా ఉప ఎన్నికల్లో గెలిచి చూపేవాడినని ధీమా వ్యక్తం చేశారు.


తాను సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి బీఆర్ఎస్, బీజేపీల అపవిత్ర కలయికే కారణమని ఆయన ఆరోపించారు. ఒకవేళ తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదన్నారు. ఖైరతాబాద్ ప్రజల సైనికుడిగా పనిచేస్తానని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ ఆశించినట్టే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రతిపక్షాలు సీఎంపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు.

Danam Nagender
KTR
BRS
Telangana Speaker
Gadadam Prasad
Revanth Reddy
Khairatabad MLA
Congress Membership
Telangana Politics
BRS LP Meeting

More Telugu News