ముగిసిన దావోస్ పర్యటన... స్వదేశానికి బయల్దేరిన నారా లోకేశ్ టీమ్

  • విజయవంతంగా ముగిసిన మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటన
  • ఆర్ఎంజెడ్ సంస్థతో సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం ఖరారు
  • ఈ ఒప్పందంతో రాష్ట్రంలో దాదాపు లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం
  • విశాఖ, రాయలసీమలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమం
  • పలు దిగ్గజ సంస్థలతో 45 కీలక సమావేశాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేశ్ బృందం సఫలీకృతమైంది.

ఈ పర్యటనలో అతిపెద్ద విజయంగా ఆర్ఎంజెడ్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం నిలిచింది. దీని ద్వారా రానున్న ఐదారు సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 91,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ పెట్టుబడులతో విశాఖపట్నంలోని కాపులుప్పాడలో భారీ ఐటీ పార్క్, డేటా సెంటర్‌తో పాటు రాయలసీమలోని టేకులోడులో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ మొత్తం 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఆర్ఎంజెడ్ తో పాటు బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, వెస్టాస్, జెరా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో భేటీ అయి, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. 


More Telugu News