ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం: ఇరాన్

  • తన వల్లే ఇరాన్‌లో 800 మందికి పైగా ఉరిశిక్షలు ఆగిపోయాయన్న ట్రంప్
  • తాము మరణ శిక్షల నిర్ణయమే తీసుకోలేదన్న మొవాహెది
  • తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని మీడియాకు విన్నపం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. తన జోక్యం వల్లే ఇరాన్‌లో 800 మందికిపైగా నిరసనకారుల ఉరిశిక్షలు ఆగిపోయాయని ట్రంప్‌ పేర్కొనడంపై ఇరాన్‌ న్యాయవ్యవస్థకు చెందిన అగ్ర ప్రాసిక్యూటర్ మొహమ్మద్‌ మొవాహెది తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని ఆయన స్పష్టం చేశారు.


నిరసనకారులకు సామూహికంగా మరణ శిక్షలు విధించాలనే నిర్ణయమే ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడూ తీసుకోలేదని మొవాహెది తెలిపారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని, అరెస్టయిన వారి సంఖ్య కూడా ట్రంప్‌ చెప్పినంత పెద్దగా లేదన్నారు. ఈ విషయంలో తప్పుడు వార్తలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియాను ఆయన కోరారు.


ఇదే అంశంపై ట్రంప్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌లో వందల మంది నిరసనకారులకు విధించబోయే ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి కారణంగా అక్కడి అధికారులు రద్దు చేశారని వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవని, తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గిందని ట్రంప్‌ తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఇరాన్‌ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తూ, అవి వాస్తవానికి దూరమని స్పష్టం చేసింది.



More Telugu News